Saturday, 6 June 2015

బల్దియాలో బకాసురులు


బల్దియాలో బకాసురులు
చేను మేస్తున్న టౌన్ ప్లానింగ్ విభాగం

హైదరాబాద్ : బల్దియా ఖాయా పియా చల్ దియా ఈ మాటను నిజం చేయటంలో బల్దియా అధికారులు ఎప్పుడూ వెనుకాడరు.ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులయితే ఈ నానుడి పుట్టిందే మాకోసం ఆన్నట్లు వ్యవహరిస్తున్నారు.హైదరాబాద్ నగరం గజిబిజిగా ఒక మాయా నగరిగా మారటంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.టౌన్ ప్లానింగ్ మాయాజాలం పై ప్రత్యేక కథనం.
పెళ్ళి చేసి చూడు ఇల్లు క‌ట్టి చూడు అనేది పాత త‌రం సామెత‌..... కానీ ఇప్పుడు మాత్రం పెళ్ళి చేయడం ఈజీ ఏమో గానీ  ఇల్లు క‌ట్ట‌డ‌మే త‌ల ప్రాణం తోక‌కి వ‌స్తుంది..  అస‌లు ఇల్లు క‌ట్ట‌డానికి కావ‌ల‌సింది ఏముంది... డ‌బ్బు స్థ‌లం  మంచి ప్లాన్.... దానికి త‌గ్గ‌ట్టు  మంచి ప‌నివారు... ఇదంతా వుంటే హ్యాపీగా ఇల్లు క‌ట్టేయ‌వ‌చ్చు అనుకుంటాం... అయ‌తే డ‌బ్బు..... స్థ‌లం.... ప్లాన్.... ప‌నివారు...
వున్నా కూడా ఇల్లు క‌ట్ట‌లేని ప‌రిస్థితి హైద‌ర‌బాద్ వాసుల‌ది .... ముఖ్యంగా మ‌ధ్య త‌ర‌గ‌తి వారి ప‌రిస్థితి మ‌రీ దారుణం... అన్ని వున్నా అల్లుడి నోట్లో శ‌ని అన్న‌ట్లు ... దేవుడి వ‌ర‌మిచ్చినా... పూజారి వ‌ర‌మివ్వ‌న‌ట్లు... అన్నీస‌క్ర‌మంగా ఇల్లు మాత్రం ప్రారంభం చేయ‌లేము.. దీనికి కార‌ణం ... అంటే  క‌ర్ణుడి చావుకి స‌వాల‌క్ష కార‌ణాలు అన్న‌ట్లు... ఇల్లు క‌ట్ట‌క‌పోవ‌డానికి స‌వాల‌క్ష కార‌ణాలు చూపుతారు.. అవ‌న్నీ కూడా ఒక్క‌చోట‌కే దారి తీస్తాయి.... అదే  అంద‌రూ ఎంతో గొప్ప‌గా చెప్పుకునే  గ్రేట‌ర్ హైద‌ర‌బాద్ మున్సిప‌ల్ కార్ప‌రేష‌న్... మున్సిపాలిటీ అంటేనే చెత్త క‌దా... అంటే అవును చెత్తే...  చెత్త అంటే చెత్త ప‌ర‌మ చెత్త .... ఇంత చెత్త‌లో కూడా అతి భ‌యంక‌ర‌మైన చెత్త సెక్ష‌న్ ఒక‌టి వుంది... అదే  టౌన్ ప్లానింగ్ సెక్ష‌న్........

టౌన్ ప్లానింగ్  అంటే సిటీ ఎలా వుండాలి... అక్క‌డ నిర్మించే ఇళ్ళు ఎలాంటి వాతావ‌ర‌ణంలో నిర్మించాలి... ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా నిర్మిస్తున్నారా... లేదా లాంటి ఎన్నో విష‌యాల‌ను  పరిశీలించాల్సి వుంటుంది.. కానీ ఇక్కడ జ‌రిగేది మాత్రం అందుకు విరుద్దంగా జ‌రుగుతూ వుంటుంది... అసలు అన్ని అనుమ‌తులు వున్నా కూడా టౌన్ ప్లానింగ్ నుండి మాత్రం మ‌న ఫైల్ క‌ద‌ల‌దు... కార‌ణం ఎవ‌రికీ తెలియ‌దు... అన్నీ అనుమ‌తులు వున్నాయి క‌దా అన్నామా... ఇక వారి అస‌లు రూపం ప్ర‌ద‌ర్శిస్తూ వుంటారు...   ఏదో ఒక వంకతో నానా తిప్ప‌లు పెడుతూ వుంటారు... చివ‌రికి ఎంత వ‌ర‌కు వ‌స్తుందంటే మ‌నం అనుకున్న  ప్లాన్ మారిపోయి అగ్గిపెట్టెల్లాంటి ఇల్లు క‌ట్ట‌డానికి కూడా  పనికి రాకుండా చేస్తారు... అదే మ‌రో వైపు ఏమీ లేకున్నా ఎటువంటి లోపాలున్నా...  ఆమ్యామ్యాలు స‌మ‌ర్పించారా... అన్నీ ఇంటికి ప‌రిగెత్తుకుంటూ వ‌స్తాయి... ముఖ్యంగా మ‌న ఇంటి ద‌గ్గ‌ర బిల్లు క‌ల‌క్ట‌ర్ నుండి  టౌన్ ప్లాన‌ర్... వ‌ర‌కు చివ‌రికి డిప్యూటి  క‌మీష‌న‌ర్  ... అడిష‌న‌ల్ క‌మీష‌న‌ర్ వ‌ర‌కు కూడా అంద‌రూ కూడా మ‌న ఇంటికి వ‌చ్చిన అన్నీ ప‌నులు చ‌క్క‌దిద్ది వెళ్ళిపోతారు.ఏ ప‌ని జ‌ర‌గాల‌న్నా కూడా   ఇక్క‌డ వారి చేతుల్లో ఏదో ఒక‌టి ప‌డాల్సిందే... అది ఎలా అంటే క‌వ‌ర్లో పెట్టి  చిత్తు కాగితాలు ఇచ్చిన కూడా దాచేస్తారు.. అంతే మ‌న ప‌ని చేసేస్తారు..... అంత‌టి ఘ‌న చ‌రిత్ర మ‌న జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ సెక్ష‌న్ది అలాగే అధికారుల‌ది... .
అంతా మనీ ప్లానింగ్

హద‌ర‌బాద్ శంక‌ర‌మ‌ఠ్ ద‌గ్గ‌ర శంక‌ర్ అనే సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఎంప్లాయి త‌ను రిటైరైన త‌రువాత ఇల్టు క‌ట్టుకుందామ‌ని కొన్ని సంవ‌త్స‌రాల క్రితం ల్యాండ్ కొనుకున్నాడు.. గ‌త నెల రిటైర్ అయ్యాడు.. వెంట‌నే త‌న‌కి వ‌చ్చిన రిటైర్ మెంట్ బెనిఫిట్ తో   ఇల్లు క‌ట్టుకోవ‌డానికి పూనుకున్నాడు... తాను  20 ల‌క్ష‌ల‌తో ఇల్లు క‌ట్టుకోవ‌డానికి స‌రిప‌డా ప్లాన్ గీయించుకోవ‌డం దానిని సాంక్ష‌న్ చేయ‌డానికి  టౌన్ ప్లానింగ్ అధికారుల ద‌గ్గ‌ర వెళ్ల‌గానే ఆయ‌న‌కి వ‌చ్చిన స‌మాధానం ఒక‌టే... ఈ ప్లాన్ ప‌నికి రాదు.. ఏదీ స‌రిగా లేదు.. అంటూ సివిల్ ఇంజనర్  గీసిన ప్లాన్ ని తిరస్కరించారు..  అందులో ఏం ప్రాబ్ల‌మ్స్ వున్నాయో  దాన్ని ఏవిధంగా మార్పులు చేయాలో కూడ చెప్ప‌కుండా  అలా చేసేస‌రికి అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నించిన కూడా  త‌నకి స‌రియౌన రెస్పాన్స్ రాలేదు.. తాను అనుకున్న ఇల్లుకోసం దాచిన డ‌బ్బు కాస్త అయిపోతుండ‌టంతో ఇక చేసేది లేక అస‌లు వారికి కావ‌ల‌సింది ఏమిటో క‌నుక్కుందామ‌ని త‌న ఇంటి చుట్టుప‌క్క‌ల తిర‌గే బిల్ క‌ల‌క్ట‌ర్ని ప‌ట్టుకుని  అడిగితే వెంట‌నే త‌న ద‌గ్గ‌ర‌నుండి వ‌చ్చిన స‌మ‌ధానం ఒక‌టే ఎంత ఇస్తార‌ని... అదేంటి అంటే మీ ప్లాన్ సాంక్ష‌న్ అయ్యి ఎటువంటి ఇబ్బందులు లేకుండా  ఇల్లు క‌ట్టుకోవాలంటే   ఇంత అవుతుంది అని నిక్క‌చ్చిగా చెప్పేసాడు... దానికి ఒప్పుకున్న  శంక‌ర్ ప‌ని రెండు రోజుల్లో అయిపోయింది.. అంత‌కుముందు ఏ ప్లాన్ అయితే ప‌నికి రాద‌న్నారో అదే ప్లాన్ కి సాంక్ష‌న్ వ‌చ్చేసింది.. ఇది ఒక్క శంక‌ర్ మ‌ఠ్లో అనుకుంటే పొర‌పాటే  జిహెచ్ఎంసి ప‌రిధిలో వున్న 18 స‌ర్కిళ్ళ‌లో ఇదే తంతు..
అఫ్జల్ గంజ్ లో మనీ ఇస్తే ఏకంగా పక్కవాడి జాగాలోనూ ఇల్లు కట్టుకోవచ్చని నిరూపించారు టౌన్ ప్లానింగ్ అధికారులు.
ఇక నగరం నడి బొడ్డున ఆబిడ్స్ లో సాక్షాత్తు పోలీస్ స్టేషన్ పక్కన జరుగుతున్న తంతు అందరికీ తెలిసిందే.
ఏ క‌మీష‌న‌ర్ అయినా మార్చ‌డానికి ప్లాన్ చేసిన కూడా ఏదో విధంగా  లంచావ‌తారులు  త‌మ పని తాము చేసుకుంటూ పోతూ వుంటారు.. ఏదో ఒక లొసుగులు వెతుక్కుంటూ పోతారు... వీరి ఆస్తులు ఎంత వ‌ర‌కు అంటే పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ ఆదాయం కంటే ఎక్కువ వుంటుంది... రీసెంట్ గా ఓ అడిష‌న‌ల్ సిటీ ప్లాన‌ర్ ఇంటిలో ఏసిబి రైడ్ చేస్తే అత‌ని ఆస్తుల‌ను చూసి అధికారుల క‌ళ్ళు బైర్లు క‌మ్మాయ‌ట‌... అలా అంద‌రూ ఇలానే వుంటారా ....ఇక్క‌డికి వ‌స్తే మారిపోవాల్సి వ‌స్తుందంటున్నారు కొంత‌మంది...  మ‌రోపైపు రీసెంట్గా వ‌చ్చిన   క‌మీష‌న‌ర్  లంచావ‌తారుల ప‌ని ప‌ట్ట‌డానికి  అన్నీ ఆన్ లైన్లో  జ‌రిగేలా డిపార్ట్మెంట్ల‌న్నీ కూడా కంప్యూట‌రైజ్ చేయ‌డం జ‌రిగింది... ప్రజానీకానికి  కూడా తెరిచిన పుస్తకంలా వుండాలంటూ ఏదైన ప్రాబ్ల‌మ్ అంటే సిస్ట‌మ్ క్లిక్ చేస్తే చాలు ప్రాబ్ల‌మ్ సాల్వ్ అంటూ హ‌డావిడి చేసారు... ఇవ‌న్నీ కూడా త‌మ‌కంటీ లెక్క అంటూ తమ‌దైన ప‌ద్ద‌తిలో  లంచావ‌తారులు హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు.... అస‌లు సిస్ట‌మ్లో క‌న‌ప‌డాలంటే సిస్ట‌మ్లోకి ఎంట్రీ చేయాలి క‌దా అంటూ చెవులు కొరుక్కుంటారు...ఏదైనా త‌మ ప‌ని అయితేనే  మీ ప‌ని ..... మా జేబులు నింపితే చాలు మీరు ఎటువంటి నిబంధ‌న‌లు పాటించ‌క‌పోయినా కూడా  హ్యాపీగా ఇల్లుకానీ... షాపింగ్ కాంప్లెక్స్ గానీ... ఏదైనా మీఇష్టం ... క‌ట్టేసుకోవ‌చ్చు... ఇది టౌన్ ప్లానింగ్ లీల‌లు.అంటే ప్రభుత్వాలు మారినా ముఖ్యమంత్రి ఎవరున్నా మారని విభాగం టౌన్ ప్లానింగ్ అని చెప్పక తప్పదు.


పాతబస్తీలో వీధి పోరాటాలు

పాతబస్తీలో వీధి పోరాటాలు

స్ట్రీట్ ఫైట్ పేరుతో హత్య

స్ట్రీట్ ఫైట్...అవును కొద్ది రోజులనుంచి హైదరాబాద్ పాత బస్తీలో స్ట్రీట్ ఫైటింగ్ ఒక ఫ్యాషన్ గా మారిపోయింది.. వీధుల్లో జన సంచారం తగ్గగానే ఒక గుంపు ప్రత్యక్షమై కొట్టుకోవటం ప్రారంభిస్తుంది. సినిమాల్లో జరిగే పోరాట దృశ్యాలను తలపిస్తూ ఒకరిపై ఒకరు ముష్టి ఘాతాలను కురిపిస్తూ చితకబాదుకుంటారు. నిజానికి వీరి మధ్య శతృత్వం ఉండదు. అయినా కసి తీరా కొట్టుకుంటారు. రక్తం ఓడుతున్నా పట్టించుకోరు. వారి లక్ష్యం గెలుపే. ఆశ్చర్యం ఏమిటంటే వీరికి ఒక రెఫరీ కూడా ఉంటాడు. చుట్టూరా మూగిన జనం ఈ పోరాటాన్ని సినిమా చూసినట్టే చూస్తారు తప్ప వారించే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఫ్యాషన్.
ప్రాణం తీసిన స్ట్రీట్ ఫైట్...
పాతబస్తీలో విస్తరించిన ఈ వికృతక్రీడ ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పంజేశా ప్రాంతంలో తెల్లవారు జామున జరిగిన స్ట్రీట్ ఫైటింగ్ లో నబీల్ అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఇదంతా సినిమా ఫక్కీలో జరగటం విశేషం.
వారంతా స్నేహితులే. ఇందులో అవేజ్  అనే యువకుడు ఎప్పుడూ తనదే పైచేయిగా తాను చేసిందే స్టయిల్‌గా గొప్పలు చెప్పుకునేవాడు. ఇదే ఆ మిత్రుల్లో ఆగ్రహానికి దారితీసింది. అవేజ్‌ను దెబ్బతీయాలని ప్లాన్ చేస్తున్న వారంతా మీర్‌చౌక్‌లోని పంజేషా ప్రాంతంలో కలుసుకున్నారు. చీకట్లో అందరూ కలిసి ప్లాన్ చేశారు. ఆ ప్లాన్‌లో భాగమే స్ట్రీట్‌ ఫైట్. అంతా అనుకున్నట్లు ఏర్పాటు చేశారు. అవేజ్‌ ఇద్దరిని ఓడించగా పైచేయి అయింది. దీంతో మరింతగా ఆగ్రహించిన మిత్రులంతా బలవంతుడుగా ఉండే నబిల్‌ను రంగంలోకి దించారు. స్ట్రీట్‌ ఫైట్‌లో మొదటగా నబీల్‌ది పైచేయిగా ఉండటంతో అవేజ్‌ రెచ్చిపోయాడు. ఇష్టం వచ్చినట్లు పిడిగుద్దులు గుద్దడంతో నబీల్‌ అక్కడే ప్రాణాలు వదిలాడు
నబీల్‌ మృతితో ఖంగుతిని ఒక్కటైన మిత్రులు విభేదాలు పక్కనపెట్టారు. బైక్‌ నుంచి పడి చనిపోయాడని, మైనర్‌ బైక్‌ నడిపినందుకు పేరెంట్స్ ను కూడా పోలీసులు అరెస్టు చేస్తారని నబిల్ కన్నవారిని బెదిరించి గుట్టుచప్పుడు కాకుండా బార్కాస్‌ స్మశానవాటికలో ఖననం చేశారు.
గుట్టు విప్పిన సెల్ ఫోన్
అంతా అయిపోయిందనుకుని ఎక్కడివారక్కడ ఊపిరి పీల్చుకోగా సెల్‌ఫోన్‌ తీసిన విజువల్స్ బయటకు రావడంతో నబిల్ హత్య వెలుగు చూసింది. పోలీసులకు సమాచారం అందిన వెంటనే యువకులను అదుపులో తీసుకుని విచారణ చేయగా ఒక్కొక్క విషయం బయటకు వచ్చింది. నబీల్‌ను హత్య చేసిన విషయం నిందితుల్లో కొందరు వారి తల్లిదండ్రులకు చెప్పారు. ఈ విషయాన్ని పోలీసుల విచారణలో యువకులు వెల్లడించారు. హత్య జరిగిన విషయం తెలిసిన్పటికీ దాచి ఉండటం నేరమే. దీంతో రహస్యంగా ఉంచిన పేరెంట్స్ పై కేసులు నమోదు చేయాలని పోలీసులు నిర్ణయించారు. మరోపక్క మైనర్లు అర్థరాత్రి దాటిన తరువాత రోడ్లపై కనిపిస్తే వారిని అదుపులో తీసుకోవడంతో పాటు పిల్లల పెంపకంలో నిర్లక్ష్యం చూపుతున్న కారణంలో తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని డిసిపి సత్యనారాయణ హెచ్చరికలు జారీ చేశారు.
స్ట్రీట్‌ ఫైట్‌లో తొమ్మిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఇద్దరు మైనర్లు ఉండటంతో జువెనల్‌ బోర్డు ముందు ప్రవేశపెట్టారు. మిగిలిన నిందితులను కోర్టులో హాజరుపరిచారు. అరెస్టు అయిన వారిలో మహ్మద్‌ అవేజ్‌ పటేల్‌ అలియాస్‌ ఓవైసీ పటేల్‌, మీర్జా ఉమర్‌ అలీబేగ్‌ అలియాస్‌ ఒమర్‌, వాసిమ్‌ ఖాన్‌ అలియాస్‌ డాలర్‌, మీర్జా నిషారుల్లా బేగ్‌ అలియాస్‌ సుల్తాన్‌ మీర్జా, మహ్మద్‌ అబ్దుల్‌ ఖఫీ అలియాస్‌ ఒబిద్‌, మహ్మద్‌ సులేముద్దీన్‌ అలియాస్‌ సులేమాన్‌, ఇమ్రాన్‌ అహ్మద్‌ ఖాన్‌ అలియాస్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ లున్నారు.
 
క్రమశిక్షణ లోపమే

ఇది పాతబస్తీలో ఒక్క ప్రాంతానికే పరిమితం కాలేదు. నబీల్ హత్యా తో అంతా గప్ చుప్ అయినా అనేక గల్లీల్లో ఇది తరచుగా జరిగే వ్యవహారమే. సంపన్న కుటుంబాలు నిరుపేదలు అనే తేడా లేకుండా పనీ పాటా లేని యువకులు ఈ వికృత క్రీడలకు పాల్పడుతున్నారు. ఇదంతా నిజంగా తల్లి దండ్రులకు తెలియకుండానే జరుగుతోందా. నమ్మలేని విషయం ఇది.పిల్లలు జులాయిగా తిరుగుతున్నా పట్టించుకోని తల్లిదండ్రులదే ఈ నేరం. పిల్లల పెంపకంలో క్రమశిక్షణ అలవరిస్తే ఇలాంటి దారుణాలు జరుగుతాయా. ఇలాంటి కేసుల్లో తల్లి దంద్రులపై కూడా కేసులు నమోదు చేస్తేనే కొంతలో కొంతైనా దీనికి అడ్డుకట్ట వేయవచ్చు.